19, సెప్టెంబర్ 2012, బుధవారం

షడ్రుచులు

పిల్లలకు రోజూ లంచ్ బాక్స్ లలో ఏం పెట్టాలో అమ్మలకు అర్ధం కాదు. వాళ్లకు ఎప్పుడూ కొత్తగా కావాలంటారు. తప్పనిసరి మనమే కొత్తవి సృష్ఠించాలి ..  ఈ రెసిపి ఒకసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లలు రోజూ కావాలంటారు. చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు..

కావలసిన వస్తువులు
బంగాళదుంపలు – 250 gms
వండిన అన్నం – 2 కప్పులు
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 3
పుదీనా ఆకులు – 10
షాజీర – 1 tsp
పావ్ బాజీ మసాలా పొడి – 1 tsp
ఉప్పు – తగినంత
నూనె – 3 tsp
నెయ్యి – 1 tsp

అన్నం పొడి పొడిగా ఉండేట్టు వండి చల్లారనివ్వాలి. బంగాళదుంపలను చెక్కు తీసి రెండు అంగుళాల సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాన్‌లో రెండు చెంచాల నూనె వేడి  చేసి ఈ బంగాళదుంప ముక్కలను దోరగా వేయించుకోవాలి. అవి తీసి పక్కన పెట్టుకుని మిగిలిన నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తబడేవరకు వేపాలి. ఇందులో పుదీనా ఆకులు, షాజీరా వేసి కొద్దిగా వేపి అన్నం వేసి కలపాలి. తర్వాత పావ్ బాజీ మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. కొద్దిగా వేగిన తర్వాత వేయించిన బంగాళదుంప ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు వేపి దింపేయాలి. పెరుగు పచ్చడి లేదా కుర్మా, సాంబార్‌తో వేడిగా సర్వ్ చేయాలి. కొత్త రకపు రుచితో చాలా బావుంటుంది ఈ అన్నం.. పిల్లలకు లంచ్ బాక్స్‌లో కూడా పెట్టొచ్చు.